కలెక్టర్‌ బదిలీ వెనక ఆ ఎమ్మెల్యే..టీఆర్‌ఎస్‌ నేతల సంబరాలు

-

ఎమ్మెల్యే ఒత్తిడితో కలెక్టర్‌ బదిలీ కావడంతో అక్కడి అధికార పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఇది రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు కారణమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రస్తుతం అధికార పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఆకస్మిక బదిలీయే ఈ చర్చకు కారణం. ఆదివారం అజీమ్‌ను హడావిడిగా ట్రాన్స్‌ఫర్‌ చేసి ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే కలెక్టర్‌గా వచ్చిన 9 నెలల 5 రోజులకే బదిలీ కావడానికి దారి తీసిన పరిస్థితులపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

కలెక్టర్లు లేదా ఇతర ప్రభుత్వ అధికారులపై.. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు సహజం. తమ మాటే నెగ్గాలని చూస్తారు నాయకులు. ఈ విషయంలో కొందరు అధికారులు రాజీ పడితే.. ఇంకొందరు రూల్‌ బుక్‌ను ఫాలోఅవుతారు. అజీమ్‌ రూల్‌బుక్‌ ప్రకారం వెళ్లడంతో అధికార పార్టీ నేతలకు రుచించలేదని సమాచారం. పైగా పనిభారం పెంచారని జిల్లాలోని ప్రభుత్వ సిబ్బంది సైతం కలెక్టర్‌పై ఒకింత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

కలెక్టర్‌ బదిలీ వెనక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కలెక్టర్‌గా వచ్చినప్పటి నుంచి గండ్రతోపాటు అధికారపార్టీ నేతలతో అజీమ్‌కు పొసగడం లేదని సమాచారం. కొన్ని సందర్భాలలో గండ్రను కలెక్టర్‌ లెక్క చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల విడుదల, రికవరీ.. కాంట్రాక్టర్లపై ఇబ్బందులు వెరసి.. కర్ణుడు చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా అజీమ్‌ బదిలీకి బాట వేశాయని అనుకుంటున్నారు. అందుకే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది తిరకుండానే ట్రాన్స్‌ఫర్‌ అయినట్టుగా భావిస్తున్నారు.

రాజకీయ ఒత్తిళ్ల మధ్య కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ జరిగిందన్న ప్రచారన్ని బలపరుస్తూ భూపాలపల్లిలో కొన్ని ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కలెక్టర్‌ బదిలీపై సంతోషం వ్యక్తం చేస్తూ అధికార పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు. అజీమ్‌ కలెక్టర్‌గా వచ్చినప్పటి నుంచి అభివృద్ధిలో జిల్లా వెనకబడిందని ఆరోపించారు. ఉద్యోగులను వేధించారని విమర్శించారు టీఆర్‌ఎస్‌ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news