కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. సహాయక చర్యలు పూర్తయితే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. బోగీల మధ్య నలిగిపోయిన మృతదేహాలను ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది. బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అలాగే బాధితులకు సంబంధించి సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619 నెంబర్లకు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు.
విజయనగరం రైలు ప్రమాద బాధితులను ఈనెల 31న నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. అటు నవంబర్ 1 నుంచి ‘నిజం గెలవాలి’ మలివిడత కార్యక్రమం ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఆమె శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తానం చెందిన మరణించిన వారి కుటుంబాలను కలిసి ఓదారుస్తారు.
మరోవైపు.. బాధితులను పరామర్శించిన తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు సీఎం వైఎస్ జగన్.. ”విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను.. వారు కోలుకునేంత వరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.” అంటూ తన ట్వీట్ (ఎక్స్)లో రాసుకొచ్చారు.