దుబ్బాకలో బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే , దుబ్బాక అభ్యర్థి రఘనందన్ రావు, ‘ఆఫీస్ ని కార్యకర్తపై బిఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. మా కార్యకర్తలను కొడుతున్నా సీపీ, పోలీసులు చూస్తూ ఉండిపోయారు. మీరు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మేం భావించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ వచ్చింది. సెక్షన్ 30 యాక్ట్ను మీరు అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సామాజిక అనుసంధాన వేదికలో తప్పుడు ప్రచారం సాగుతోందని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై దాడికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి హింసకు తావులేదని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి విషయంలో పోలీస్ కమిషనర్ శ్వేత వ్యాఖ్యల వల్ల తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి అనే తమ పార్టీ కార్యకర్తను మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారని, నవీన్ అనే మరో కార్యకర్తపై దాడి జరిగిందన్నారు. మా కార్యకర్తలపై జరిగే దాడికి పోలీసులు వెంటనే స్పందించాలని లేదంటే రేపు ఉదయం తాను కార్యాలయానికి వచ్చి రాతపూర్వక ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పోలీస్ కమిషనర్… ముఖ్యమంత్రి, మంత్రి జిల్లాలో పని చేస్తున్నారని అందుకే వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తల ఇల్లు, దుకాణాలపై దాడులు జరుగుతుంటే, వారిని కొడుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్నారు.