ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలు షట్ డౌన్ ని ప్రకటించాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఏపీ లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కరోనా ప్రభావిత రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దీనితో కరోనా ఏపీలో కూడా విస్తరించే సూచనలు కనపడుతున్నాయి. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని, ఏపీ కేబినేట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సీనియర్ మంత్రులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
ఏప్రిల్ 15 వరకు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలు అప్పటి వరకు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా బాధితుల సంఖ్య మన దేశంలో దాదాపు వంద వరకు ఉంది. తెలంగాణాలో ఒక్క కేసు నమోదు అయింది. ఒక వ్యక్తి డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ప్రస్తుతం ఇటలీ కి చెందిన వ్యక్తి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.