స్పెయిన్‌లోనూ కోవిడ్-19 కలకలం రేపుతున్నది. అక్కడ ఇప్పటికే 6,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 193 మంది మృతిచెందారు. ఇంకా రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్త కేసులతోపాటు క్రమంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. దీంతో స్పెయిన్ సర్కారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
ఇదిలావుంటే, తాజాగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సతీమణి బెగోనా గోమెజ్ కూడా కరోనా బారినపడింది. శనివారం ఆమె వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రధాని దంపతులు ఇద్దరూ ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ప్రధాని పెడ్రో సాంచెజ్ దంపతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన అక్కర్లేదని వారిని పర్యవేక్షిస్తున్న వైద్యుల బృందం ప్రకటించింది.
కాగా, తన సతీమణి బెగోనా గోమెజ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడానికి కొద్దిగంటల ముందే స్పెయిన్ ప్రధాని సాంచెజ్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర పనులకు తప్ప జనం ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశించారు. సోమవారం నుంచి దేశంలోని విద్యాసంస్థలు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాలని ఆర్డర్ జారీచేశారు.