ఎన్నికల ముందు కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. అభ్యర్థుల ఎంపికలో తన పేరును పరిశీలించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి కూడా తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు.
కర్ణాటక రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా ఈశ్వరప్పకు అనుభవం ఉంది. సాధారణ బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు ఎదిగారు. శివమొగ్గ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఈశ్వరప్ప. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కంచుకోటగా మలిచారు. ఇప్పుడు కూడా ఆయనకే టికెట్ దక్కడం ఖాయమౌతుందనే వార్తలు వెలువడుతున్నాయి.
బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వస్తోన్నారాయన. మొన్నటి వరకు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించడం చర్చనీయాంశమౌతోంది. కర్ణాటకలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు అదే బాటలో ఆయన శిష్యుడిగా, బీజేపీలో నంబర్ 2 గా ఉంటోన్న ఈశ్వరప్ప కూడా తప్పుకోవడం కలకలం రేపుతోంది.