వరుస షాకులతో విలవిల్లాడుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ వరుస షాకులు తగలనున్నాయి. ఓకే జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యేడాది ఎన్నికల్లో టీడీపీ పరువు దక్కించుకున్న జిల్లాల్లో ప్రకాశం ఒకటి. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ మంచి సత్తా చాటింది. అంత వ్యతిరేకతతో కూడా జిల్లాలో నాలుగు కీలక స్థానాలను గెలుచుకుంది. ఊహించని విధంగా టీడీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
కొండపి నుంచి బాలవీరాంజ నేయ స్వామి, చీరాల నుంచి సీనియర్ నేత కరణం బలరాం, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్… పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు విజయం సాధించి సత్తా చాటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు వాళ్ళు పార్టీలో ఇమడ లేక ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఒక్క ఏలూరి సాంబశివరావు మినహా మిగిలిన వాళ్లందరు పక్క చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి కరణం బలరాం బిజెపిలోకి వెళ్తారని రెండు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయనకు సుజనా చౌదరికి మంచి సంబంధాలు ఉన్నాయి.
ఇటీవల ఒక యాత్ర సందర్భంగా ఆయన ఇంట్లోనే సుజనా చౌదరి భోజనం కూడా చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన పార్టీ మారడం లేదని అంటున్నారు. ఇక బలరాంకు అటు వైసీపీ నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇది పక్కన పెడితే కొండపి నుంచి విజయం సాధించిన స్వామి, అద్దంకి నుంచి విజయం సాధించిన గొట్టిపాటి రవి ఇద్దరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నట్టు భోగట్టా. స్వామి విషయంలో జగన్ కూడా సానుకూలత వ్యక్తం చేశారని అంటున్నారు.
ఇక తన వ్యాపారాలకు ఏ ఇబ్బందులు రాకూడదు అని భావిస్తున్న రవికుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన ఆల్రెడీ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన వ్యక్తే. ఇప్పటికే ఎంపీలు నందిగం సురేష్, మాగుంట శ్రీనివాసుల రెడ్డితో ఆయన మాట్లాడారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీళ్ళు పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నా… జిల్లా నేతలను మాత్రం వారిద్దరూ పరిస్థితులను బట్టి అడుగులు వేస్తారని, సంక్రాంతి తర్వాత లేదా మార్చిలో మారే అవకాశం ఉందని అంటున్నారు.