కరుడుగట్టిన కామ్రేడ్‌లు పక్కాపార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వామపక్ష భావజాలం నింపుకున్న కన్హయ్య కుమార్‌పై పార్టీ గుర్రుగా ఉండటంతో .. జేడీయూ వైపు చూస్తున్నట్లు సమాచారం. అసలు బెగుసరాయ్ చిన్నోడి అడుగులు ఎటువైపు..
కన్హయ్య కుమార్ జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు. క్యాంపస్‌లో ఆజాది కామెంట్ల వివాదంలో అతనిపై కేసులు ఉన్నాయి. వామపక్ష భావజాలం ఉన్న కన్హయ్య కుమార్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో సొంత రాష్ట్రం బిహార్‌లోని బెగుసరాయ్ నుంచి పోటీ చేసి.. ఓడిపోయాడు. మోదీ వ్యతిరేక ఆందోళనల్లోనూ యాక్టివ్‌గా పాల్గొన్నాడు. అయితే కన్హయ్యకుమార్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం బిహార్‌లో గట్టిగా వినిపిస్తోంది.
కన్హయ్యకుమార్‌పై సీపీఐ పార్టీ కేంద్ర కమిటీ ఆగ్రహంగా ఉంది. ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదని మండిపడుతోంది. గతేడాది డిసెంబర్ చివర్లో కన్హయ్యకుమార్ పాట్నా ఆఫీస్ సెక్రటరీతో గొడవకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీపీఐ కేంద్ర కమిటీ కన్హయ్యపై గుర్రుగా ఉంది. అతని తీరు సరికాదని భావించింది. దీంతో కన్హయ్యను ఆక్షేపిస్తూ తీర్మానం ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది సీపీఐ కేంద్ర కార్యవర్గం.
కామ్రేడ్ల తీరుతో కన్హయ్య కుమార్ హర్ట్ అయినట్లు ఉన్నాడు. వెంటనే రూట్ మార్చాడు. వామపక్ష సిద్ధాంతాలతో ఇన్నాళ్లు పోరాటాలు చేసిన కన్హయ్య కుమార్.. ఆదివారం సడెన్‌గా బీహార్ మంత్రి ఇంట్లో కనిపించాడు. సీఎం నితీష్‌కుమార్‌తో సన్నిహితంగా ఉండే మంత్రి అశోక్ చౌధురితో భేటీ అయ్యాడు. ఈ వార్త.. ఇప్పుడు బీహార్‌లో ఆసక్తికరంగా మారింది. దీంతో కన్హయ్య.. జేడీయూలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే ఈ భేటీపై అటు కన్హయ్య కుమార్.. ఇటు మంత్రి నోరు విప్పడం లేదు. మరోవైపు కన్హయ్య పార్టీ మారుతారన్న కామెంట్స్‌ను జేడీయూ కొట్టి పారేస్తోంది. సైద్ధాంతికంగా వైరుధ్యాలున్న నేతల మధ్య భేటీ సహజమేనని చెబుతున్నారు. మొత్తంగా ఈ జేఎన్‌యూ మాజీ విద్యార్ధి నేత అడుగులు హాట్ టాపిక్‌గా మారాయి.