తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న భాజపా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు కాషాయ దళం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 17న మొదలు పెట్టి అక్టోబరు 2న ముగించే విధంగా ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి పది జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఒక్కో క్లస్టర్కు ఒక కీలక నేత నేతృత్వం వహించేలా సన్నాహాలు చేస్తోంది.
ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో కీలక నేత నేతృత్వం వహిస్తారు. తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ఈ బస్సుయాత్ర తోడ్పడుతుందని బీజేపీ భావిస్తోంది.