నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపోయి అధికారానికి దూరమైంది. ఈ సారి కూడా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమవుతుంది. ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా పార్టీ దారుణమైన స్థితికి చేరుతుంది. అయితే ఇక్కడ అధికారం కాకపోయినా రెండోస్థానంలోకి రావడం కూడా ముఖ్యమే. ఎందుకంటే మరోవైపు బిజేపి పుంజుకుంటూ వస్తుంది.
ఈ క్రమంలో బిఆర్‌ఎస్-బిజేపిల మధ్య గాని పోరు జరిగితే కాంగ్రెస్ మూడో ప్లేస్ లోకి వెళుతుంది. ఇక మూడో ప్లేస్ లోకి వెళితే ఇంకా పార్టీ పరిస్తితి దారుణం అవుతుంది. అందుకే ఈ సారి పార్టీకి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్నారు. అదే సమయంలో ప్రజలని ఆకట్టుకోవడానికి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే రూ. 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పుకొస్తున్నారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని రేవంత్ చెబుతున్నారు.
ఇంకా కీలక హామీలు ఇస్తున్నారు..ఇంట్లో ఇద్దరు అర్హులు ఉంటే..పెన్షన్ ఇద్దరికీ ఇస్తామని, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచుతామని ఇలా పలు హామీలు ఇస్తున్నారు. ఇలా హామీలు ఇస్తుండటంతో ఇప్పటివరకు బిజేపిని టార్గెట్ చేసి బిఆర్‌ఎస్..కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. రాజకీయ యుద్ధం మారింది.
ఇదే సమయంలో రేవంత్ వేసిన స్ట్రాటజీలోనే బిజేపి వెళుతుంది..బిజేపి నేతలు కూడా కార్నర్ మీటింగుల్లో పాల్గొంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. పెన్షన్, ఇతర కార్యక్రమాల గురించి హామీలు ఇస్తున్నారు. అయితే ఎన్నికల హామీలు ఇప్పటినుంచే ఇస్తూ రేవంత్ ఓ ట్రెండ్ సెట్ చేశారనే చెప్పవచ్చు.