తిరుపతి ఉపపోరు ప్రచారంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు… ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది. కోన్ని సార్లు అనుకోకుండా వచ్చే మైలేజ్ పై ఎన్నో ఆశలు పెట్టుకునుంటాయి పార్టీలు.అలా బీజేపీ నేతలు కూడా ఇప్పుడు పవన్ సినిమా పై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో తమను గట్టెక్కించేది వకీల్ సాబ్ మాత్రమే అని లెక్కలేస్తున్నారట.
ఉపఎన్నిక ముందే మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని సిఎం అభ్యర్థి అంటూ ప్రకటించి ఎన్నికల బాధ్యతను జనసైనికుల భుజాన వేసిన బిజెపి, ఇప్పుడు పవన్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. అంటే ఆ తర్వాత సరిగ్గా వారానికి ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనుంది. బీజేపీ తరుపున మాజీ ఐఎఎస్ రత్న ప్రభ, వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. అయితే వకీల్ సాబ్ సినిమా తమను రేసులో నిలబెడుతుందని బీజేపీ నేతలు కొండంత ఆశలు పెట్టుకున్నారట.
కీలక ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు చెందిన హీరోల చిత్రాలు మ్యాజిక్ చేసిన సందర్భాలు ఉన్నాయాని చెబుతున్నారు బిజెపి నేతలు. 2009లో బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సైతం టీడీపీ విజయానికి ఉపయోగపడిందని లెక్కలేస్తున్నారు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా సైతం హిట్టైతే పవన్ అభిమానులు ఇంక రెట్టించిన ఉత్సహాంతో ఎన్నికల్లో పని చేస్తారని అది బీజేపీ అభ్యర్దికి ప్లస్ అవుతుందని బిజెపి నేతలు కొండంత నమ్మకం పెట్టుకుంటున్నారు.