బిజెపి తనకి గురువులాంటిదని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి వారే తనకు ఒక మార్గాన్ని చూపించారని.. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది బిజెపి వారు తనకి ఎప్పటికప్పుడు చెబుతుంటారని అన్నారు. అందుకే బిజెపిని తన గురువుగా భావిస్తానని అన్నారు. బిజెపి తనపై మరిన్ని తీవ్ర ఆరోపణలు చేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
బిజెపి నేతల విమర్శలతోనే భారత్ జోడో యాత్రకు భారీగా ప్రచారం లభించిందన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర ప్రారంభించినప్పుడు ఈ యాత్రను తాను ఒక సాధారణ యాత్ర గానే తీసుకున్నానని.. కానీ ఈ యాత్రకి కూడా ఎన్నో స్వరాలు, అనుభవాలు ఉన్నాయని మెల్లగా అర్థం చేసుకున్నామన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందన్నారు. తమతో కలవాలని వచ్చేవారిని అడ్డుకోమని స్పష్టం చేశారు.