భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంత్‌కుమార్ మృతితో పార్టీ బలమైన నేతను కోల్పోయిందని వారు పేర్కొన్నారు, పార్టీ కోసం ఎంతో సేవ చేశారని కొనియాడారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను బీజేపీ జీర్ణించుకోలేదని, కర్ణాటకతోపాటు దేశంలో బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంతగానో శ్రమించారని, బెంగళూరులో తమపార్టీకి ఆయన ఓ గుండెకాయలాంటివారని ట్వీట్ చేశారు.
Deep sense of grief on hearing that Shri @AnanthKumar_BJP is no more with us. Served @BJP4India @BJP4Karnataka all along. Bengaluru was in his head and heart, always. May God give his family the strength to bear with this loss.
— Nirmala Sitharaman (@nsitharaman) November 12, 2018
గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పార్టీకి తీరని లోటుగా కొంత మంద్రి భాజపా నేతలు పేర్కొంటున్నారు. పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని లాల్‌బాగ్ రోడ్డులోని ఆయన నివాసానికి తరలించారు. ఉదయం 8 గంటల వరకు అక్కడే ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్ధం నేషనల్ కాలేజ్ గ్రౌండ్‌కు తరలించనున్నారు.
మధ్యాహ్నం అనంత్‌కుమార్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన 1959 జులై 22న కర్ణాటకలో జన్మించారు. తొలిసారిగా 1996 సాధారణ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మోదీ మంత్రివర్గంలో తొలుత ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.