గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్పయాత్రకి బ్రేక్ పడిన సందర్భంగా…నేటి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా నేటి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు జగన్ పాల్గొననున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయనకు విశాఖ ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆయనపై గత నెల 25న ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిన తర్వాత ఆయన విశాఖ రావడంతో పెద్దఎత్తున కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు.
హైదరాబాదు నుంచి ఇండిగో విమానంలో సాయంత్రం 6.40 నిమిషాలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డుమార్గంలో విజయనగరం వెళ్లారు. జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు మిధున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. హత్యాయత్నాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు వైసీపీ అధినేతకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నాయకులు సైతం జగన్ వద్దకు వెళ్లాలను కుంటే మందస్తు అనుమతి తీసుకోవాల్సిందే అంటూ సెక్యూరిటీ అధికారులు వివరించారు.