తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తుంది…బలంగా ఉన్న కేసీఆర్ బలాన్ని తగ్గించే దిశగా పనిచేస్తుంది..అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తెలంగాణలో బలపడటమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. పైగా రాష్ట్ర బీజేపీ నేతలకు., కేంద్రంలోని పెద్దలు ఫుల్ గా సపోర్ట్ ఇస్తున్నారు. అసలు వారు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర పర్యటన చేస్తూ…పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
ఇప్పటికే కేంద్రంలోని పెద్దలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే…ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సారి తెలంగాణలో మరింత పుంజుకోవడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త మాస్టర్ ప్లాన్ తో ముందుకొస్తుంది. ఏకంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలని హైదరాబాద్ లో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2,3 తేదీల్లో జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల నుంచే తెలంగాణలో బీజేపీ బలపడటంతో పాటు…డిసెంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం కానుంది. అంటే జాతీయ కార్యవర్గం సమావేశాల పేరుతో…బీజేపీ తెలంగాణలో సరికొత్త పోలిటికల్ గేమ్ షురూ చేయనుందని అర్ధమవుతుంది.
ఈ సమావేశం నుంచే ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి నేతలు…తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడంపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అక్కడ నుంచే రాష్ట్రంలో కేసీఆర్ బలం మరింత తగ్గించేలా వ్యూహాలు రచించుకుని ముందుకెళ్లనున్నారు. మొత్తానికైతే తెలంగాణలో కేసీఆర్ ని గద్దె దించి…తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదపనుంది.