కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను.. రద్దు చేస్తూ రెండు రోజుల కింద దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా రైతులు చేసిన ఉద్యమంతో దిగి వచ్చిన మోడీ సర్కార్… ఈ మేరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు.. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు… కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలు తిరిగి రావచ్చు అంటూ పేర్కొన్నారు సాక్షి మహారాజ్. “వ్యవసాయ చట్టాలకు ఎన్నికలతో సంబంధం లేదు…ప్రధాని మోడీకి దేశమే ముందు. వ్యవసాయ బిల్లులు వచ్చాయి.. రద్దు చేయబడ్డాయి. కానీ ఆ చట్టాలు తిరిగి రావచ్చు… వాటిని మళ్లీ రూపొందించవచ్చు. కానీ ప్రధాని మోడీకి దేశమే ముఖ్యం ” అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపి సాక్షి మహరాజ్