ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సీఎం జగన్ సర్కార్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతియే ఏపీకి రాజధాని అని దానిని ఎవరూ మార్చలేరని ఆయన తేల్చేశారు. తాజాగా అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా సుజన చౌదరి మరోసారి అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. 200 రోజులుగా ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజలందరికీ మేమంతా మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాము.
మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను అని తెలిపారు. పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో రైతులు భూములు ఇవ్వలేదు. ప్రభుత్వం నిరంతరంగా ఉంటుంది. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక మడమ తిప్పడం విచారకరం అని విమర్శించారు. అలాగే అమరావతిపై కేంద్రం స్పదించే సమయం ఇంకా రాలేదని దీనిపై కేంద్రం సరైన సమయంలో స్పదిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు.