తెలంగాణలో రంజుగా బీజేపీ రాజకీయం.. మరో నేతకు గాలం…!

హైదరాబాద్: తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు ఎలాంటి అవకాశం దొరికినా వదిలిపెట్టడంలేదు. టీఆర్‌ఎస్‌కి గుడ్ బై చెప్పిన ఈటల.. ఈనెల 13న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థ పుచ్చుకోనున్నారు. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా బీజేపీలో చేరనున్నారు. వీరి చేరిక తమకు తెలంగాణలో బలపడేందుకు మంచి అవకామని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భేటీకావడం ఇప్పుడు ప్రాధానత్య సంతరించుకుంది. దాదాపు నాలుగు గంటల పాటు వీరి మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డిని డీకే అరుణ బీజేపీలోకి ఆహ్వానించారట.

అయితే ఆమె అభ్యర్థనకు కొంత సమయం కావాలని రాజగోపాల్ రెడ్డి అడిగారట. త్వరలో తన నిర్ణయాన్ని చెప్తానని అరుణకు రాజగోపాల్ రెడ్డి తెలిపారట. ఇటీవల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కూడా భేటీ అయి.. ఆయన్ను కూడా డీకే అరుణ బీజేపీలోకి ఆహ్వానించారు. ఇక ఈటల బీజేపీ బాట పట్టడం కన్‌ఫర్మ్‌ కావడంతో.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి.