తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై ఏపీ బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. దీనికోసం అభ్యర్థి విషయంలో ఎడతెగని కసరత్తు చేసింది. స్థానికులకే టికెట్ అని ముందుగా భావించిన పార్టీ పెద్దలు తరువాత కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభను తెరపైకి తెచ్చారు. అనేక సమీకరణాలు లెక్కలు వేసిన బీజేపీ రత్నప్రభ అభ్యర్దిత్వం వైపు మొగ్గు చూపింది.
తిరుపతి లోక్‌సభ ఎస్సీ రిజర్వ్ సీటు. గతంలో ఇక్కడ నుంచి అనేక మంది రిటైర్డ్ అధికారులు పోటీ చేశారు. 2019 వరకు ఎంపీగా ఉన్న వరప్రసాద్ కూడా రిటైర్డ్ అధికారే. బీజేపీ కూడా రిటైర్డ్ అధికారుల వైపే మొగ్గు చూపడంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు రత్నప్రభను ఫైనల్ చేశారు. వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ఎస్సీలలో మాల సామాజికవర్గానికి చెందిన వారు. అందుకే మాదిగ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి కోసం వేచి చూసి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
కర్నాటక సీఎస్‌గా పనిచేస్తున్న సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వంతో రత్నప్రభకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పదవీ విరమణ చేశాక నామినేటె పోస్ట్ ఇచ్చి గౌరవించారు కూడా. తిరుపతి ఉపఎన్నిక గురించి చర్చ ప్రారంభమైన మొదట్లో రత్నప్రభ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఢిల్లీ పార్టీ పెద్దల సూచన మేరకే రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. ఆమె తండ్రి, భర్త మరికొందరు కుటుంబ సభ్యులు ఐఏఎస్ లే. అది కూడా కలిసి వచ్చినట్టు చెబుతున్నారు. అప్పటి వరకు తిరుపతిలో స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన బీజేపీలో వెనక్కి వెళ్లిపోయింది.
రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉంది. పైగా తిరుపతి వైసీపీ సిట్టింగ్ స్థానం. టీడీపీ నుంచి బలమైన అభ్యర్ధే బరిలో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత తమ క్యాండిడేట్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలని భావించింది బీజేపీ. కుల సమీకరణాలు.. రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత రత్నప్రభ వైపు మొగ్గు చూపారు కమలనాథులు. ఆర్థికంగా బలమైన క్యాండిడేట్‌ను బరిలో దించుతామని కొందరు సూచించినట్టు సమాచారం. కానీ.. రత్నప్రభ ప్రొఫెల్ ముందు అవన్నీ తేలిపోయాయట. టీడీపీ, వైసీపీలు మాల సామాజికవర్గం ఓట్లు చీల్చుకుంటే.. మాదిగ సామాజికవర్గం ఓట్లు తమకు గంపగుత్తగా పడతాయంటున్నారు కమలనాథులు.