ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరకాటంలో పడేయాలని కాచుకుని కూర్చున్న బీజేపీకి.. ఒక అవకాశం దొరికింది. ఇదే అదునుగా వైసీపీ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న ప్రకటనలతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత ప్రజలు, రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇదే అవకాశంగా భావించిన బీజేపీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోంది.
రాధానిని మారిస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని మార్చొద్దని అన్నారు. మరోవైపు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, తదితర నేతల బృందం రాజధాని ప్రాంతంలోపర్యటించింది. అక్కడి ప్రజలు రైతులతో మాట్లాడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని మారదని, మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసినా తాము చూస్తూ ఊరుకోబోమని భరోసా ఇచ్చింది.
అంతేగాకుండా.. రాజధానిని మార్చడం అంత సులభం కాదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ధైర్యంగా ఉండాలని బీజేపీ నేతలు చెప్పారు. అంతేకాకుండా.. ఇప్పటికే చాలా నిర్మాణాలు జరిగాయని, ఇక్కడ అన్ని నిర్మాణాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతితోనే జరుగుతున్నాయని కూడా వారు రాజధాని ప్రాంత ప్రజలకు చెప్పారు. ఇలా వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూనే.. ప్రజల్లో సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నం చేశారు.
ఇక్కడ బీజేపీ నేతలు కొన్ని కీలక ప్రశ్నలు కూడా సంధించారు. రాజధాని విషయం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. రాజధాని ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే భూములు కొనుగోలు చేస్తే.. వెంటనే చర్యలు తీసుకుని, ప్రజల ముందు ఆ వివరాలను ఉంచాలని కూడా డిమాండ్ చేశారు. అంతేగానీ.. ఇలా మంత్రులతో ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేయించడం సరికాదని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా పాగా వేయాలని, టీడీపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలని చూస్తున్న బీజేపీ..మొన్నటివరకు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది. కానీ.. రాజధాని విషయంలో మాత్రం ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేతల వార్నింగ్‌కు ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.