ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మీనారాయణ కు స్వస్తి పలికేందుకు రంగం సిద్దం చేసారు బీజేపీ అగ్ర నేతలు. కొత్త అధ్యక్షునిగా ఎమ్మెల్సీ మాధవ్‌కు పగ్గాలు ఇవ్వనున్నట్టు సమాచారం. కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. కానీ ఎమ్మెల్సీ మాధవ్ మాత్రం ముందు నుంచి బీజేపీ లోనే ఉన్నారు. మాధవ్ ఎంపిక చేసిన విషయం పై త్వరలో నిర్ణయం వెలువడనున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
మాధవ్ తండ్రి పీవీ చలపతి బీజేపీ కి చెందిన వ్యక్తి కావడం, మాధవ్ విశాఖ జిల్లా కు చెంది ఉండడం ఆయన బీజేపీ అధ్యక్ష పదవి కి అర్హుడిని చేశాయని అంటున్నారు. ఆయన తండ్రి పీవీ చలపతి కూడా గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు చలపతి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు 40 ఏళ్ల తరువాత ఆయన కుమారుదు బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక అయ్యే అవకాశం వచ్చింది.
అంతే కాకుండా శాసనమండలి రద్దు చేస్తే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పదవి కూడా పోయె అవకాశం ఉండటం తో ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారట. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది. విశాఖ కేంద్రంగా పాలన సాగితే, ఆ ప్రాంతానికి చెందిన మాధవ్‌కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి తద్వారా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి అనుకూలంగా ఉంటుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఏప్రిల్ మొదటి వారంలో కీలక నిర్ణయం వెలువడనుంది అని రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న తాజా వార్త.