టీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విరుచుకుపడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇటీవల టీఎన్జీవో నేతలపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలపై ఓ రేంజ్‌లోనే ఆరోపణలు చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా తలపెట్టిన భారత్ బంద్‌కు టీఎన్జీవో మద్దతు తెలియజేసినప్పటి నుంచి బీజేపీ నేతలు చాలా గుర్రుగా ఉన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఉద్యోగులు బంద్‌లో పాల్గొంటారని టీఎన్జీవో ప్రకటించడంపై మండిపడుతున్నారు. ఆ కారణంగానే టీఎన్జీవో నేతలపై సంజయ్ ఒంటి కాలి పై లేస్తున్నట్టు భావిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులంటే కస్సుమంటున్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన చేస్తున్న ఆరోపణల తీరు కూడా గంభీరంగానే ఉంటోంది. రైతుల సమస్యలకు.. ఉద్యోగ సంఘాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. అంతేకాదు.. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా… ఉంచుకున్నోళ్లు.. పెంచుకున్నోళ్ల కోసం జీవోలు తెచ్చుకుంటున్నారని టీఎన్జీవో నేతలను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎన్జీవో పదవులను అడ్డంపెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారని.. అలాంటి వారి సంగతిని తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు కమలనాథులు.
గతంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులపై దాడి చేయలేదు. పైగా వారి మద్దతు కోసం పాకులాడేవి పార్టీలు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల పాత్రను, బలాన్ని దృష్టిలో ఉంచుకుని టీఎన్జీవో నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ.. బీజేపీ భిన్నమైన లైన్ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. దీనిపై ఉద్యోగుల్లోనూ చర్చ జరుగుతోంది. బండి సంజయ్ మాట్లాడిన మాటలు వీడియో క్లిప్పింగ్స్ రూపంలో ఉద్యోగుల గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు. టీఎన్జీవో నేతల విషయంలో బీజేపీ ఏం చేయబోతుందన్న ఆసక్తి నెలకొంది.
గతంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన స్వామిగౌడ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. స్వామిగౌడ్ ద్వారానే టీఎన్జీవో సంఘంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ సంఘానికి చెందిన మరో మాజీ నేతతోనూ బీజేపీ నాయకులు టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. వీరిద్దరి సాయంతో ఉద్యోగులను ఆకర్షించడం లేదా ఉద్యోగ సంఘంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే అసంతృప్తిలో ఉద్యోగులు ఉన్నట్టు చెబుతున్నారు. వీటిని టీఎన్జీవో నేతలు ప్రభుత్వం దగ్గర బలంగా ప్రస్తావించడం లేదని గుర్రుగా ఉన్నారట. ఈ అంశాలను అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. మరి.. ఈ విషయంలో బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.