రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి లేని భారతీయ జనతా పార్టీ టీడీపీని కొల్లగొట్టి ప్రతిపక్ష హోదాను స్వాధీనం చేసుకోవాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు రాజ్యసభ, ఎంపీలపై గురిపెట్టి లాగేసుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే నయానో…భయానో.. టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేసుకోవాలని యోచిస్తోదంట. పైపెచ్చు ఇప్పటి నుంచే పార్టీని విస్తృతం చేసుకుంటే పోతేగాని ఎన్నికల నాటికి తాము అనుకుంటున్న అధికారం లక్ష్యం నెరవేరదని కూడా సమాచారం.
టీడీపీలో కీలకంగా పనిచేసిన సుజానా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారితో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి ఐదుగురు రాజ్యసభ ఎంపీలుంటే.. అందులో నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. తమ ఆస్తులను కాపాడుకోవడానికి, వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఇలా పార్టీ మారారనే ఆరోపణలు వారిపై ఉన్న మాటమాత్రం వాస్తవం. ఏది ఏమైనా ఇది టీడీపీని తీవ్రంగా దెబ్బతీసిందనే చెప్పాలి.
మరోవైపు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకి రావడానికి ఇష్టపడరని తెలిసిన నేపథ్యంలో పూర్తిగా టీడీపీని ఖాళీ చేయాలని స్కెచ్ వేస్తోందట. ఇటీవలే బీజేపీ నేత సోము వీర్రాజు ఏకంగా మీడియా ఎదుటే చేసిన వ్యాఖ్యలు టీడీపీని శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని ఓ వర్గం మీడియా కాపాడాలని చూస్తోందని, మీడియా ఆ పార్టీ గురించి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీలోని 22 మంది ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చుకుంటామని చెప్పడం గమనార్హం.
ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పట్టేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పుకోవడానికే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన కమిటీల్లో రాజ్యసభ సభ్యుడు కనకమేడలకు, ఎంపీ కేశినేనికి అవకాశం కల్పించారని కూడా బీజేపీ శ్రేణులే గుర్తు చేస్తుండటం గమనార్హం. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని భారతీయ జనతా పార్టీ ఎన్నికల అనంతరం టీడీపీలో ఏర్పడుతున్న సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడిందన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది.