దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో మగ్గుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కార్యచరణ రచిస్తోందన్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ పాలన అంతమవుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కుటుంబపాలన కొనసాగుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం గెలుస్తుందన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆదర్శాలు, విధానాలు లేవన్నారు. ఆ పార్టీ అత్త-మేనల్లుడి పార్టీ అని పేర్కొన్నారు. గతంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎలా ఓడించామో.. ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అలా ఓడించాలన్నారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని జేపీ నడ్డా తెలిపారు.