తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్‌ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.
మరి కాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. ఇది ఫేక్ కాల్ అని గుర్తించిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన ఆ అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ భవనం గతంలో ప్రగతి భవన్ గా కొనసాగింది. ఇందులో తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం ఉండే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను తొలగించేశారు. ప్రస్తుతం ప్రజా భవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసం కొనసాగుతోంది.