ఓ వ్యక్తి తన కూతురి మరణానికి కారణమైన సంస్థ వెయ్యి కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఆ కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ ఆరోపణలపై స్పందన తెలియజేయాలంటూ వ్యాక్సిన్ తయారీ సంస్థతో పాటు ఇతర ప్రతివాదులను కోరింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
మహారాష్ట్రకు చెందిన దిలీప్ లునావత్ కుమార్తె స్నేహాల్ లునావత్ ఓ వైద్య విద్యార్థిని. నాసిక్‌లో చదువుతున్న ఆమె గతేడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తీవ్ర జ్వరం, వాంతులు మొదలుకావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు స్నేహాల్ మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి గతేడాది మార్చి 1న ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వ్యాక్సిన్ అనంతర దుష్ప్రభావాల కమిటీ (AEFI) గతేడాది అక్టోబర్ 2 నివేదిక ఇచ్చింది.
అయితే, తన కుమార్తె మరణానికి టీకానే కారణమని ఆరోపిస్తూ.. ఏఈఎఫ్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమె తండ్రి దిలీప్ లునావత్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, జస్టిస్ మాధవ్ జందార్‌లతో కూడిన ధర్మాసనం.. వ్యాక్సిన్ సంస్థతో పాటు కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాలకు (ఆగస్టు 26న) నోటీసులు జారీ చేసింది.