మరణ శిక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నిర్భయ హంతకులు మరణ శిక్ష నుంచి తప్పించుకోవడానికి గాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 1 ఉదయం ఆరు గంటలకు ఉరి శిక్ష అమలు చేస్తున్న నేపధ్యంలో తమ ఉరిని ఎలాగైనా ఆపాలని వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ సుప్రీం కోర్ట్, రాష్ట్రపతి, ఆ కోర్ట్ ఈ కోర్ట్ అంటూ వాయిదా వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని నిర్భయ రేప్ కేసు దోషి వినయ్ కుమార్ శర్మ బుధవారం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 16, 2012 న ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినందుకు వినాయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తా మరియు అక్షయ్ ఠాకూర్ కి మరణశిక్ష విధించారు. ఒక మైనర్ దోషిని ఇప్పటికే విడుదల చేయగా ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన జరిగిన 10 నెలల్లోపు ఐదుగురిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చినప్పటికీ, హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో అప్పీళ్లు ఉరిశిక్షలు పెండింగ్ లో పడుతూ వస్తున్నాయి. తిహార్ జైలు అధికారులు ఫిబ్రవరి 1 న ఉరిశిక్ష కోసం అన్నీ సిద్ధం చేశారు, కాని తేదీని మార్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ముఖేష్ కుమార్ పిటీషన్ ని సుప్రీం కోర్ట్ ధర్మాసనం నేడు కొట్టేసిన సంగతి తెలిసిందే. మరి ఈ పిటీషన్ ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే డెత్ వారెంట్ కూడా విడుదల చేసారు.