ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. పంచాయితీ, జెడ్పీటీసీ సహా మున్సిపల్ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 21న తొలిదశ, 24న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 27న జరగనుంది. ఏకకాలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 29న నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే సత్తా చాటాలని అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీలు పట్టుదలగా ఉన్నాయి.
సంక్షేమ కార్యక్రమాలనే ప్రచార అస్త్రాలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక విపక్షం మాత్రం అధికార పక్షం పై తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసి వస్తుందని భావిస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ ఎన్నికలు మాత్రం ఇప్పుడు ప్రధాన పార్టీలకు మెడ మీద కత్తిలా మారిపోయాయి.