కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దొరకడం లేదని.. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత బ్రిజేశ్ కలప్ప పార్టీకి రాజీనామా చేశారు. 25 ఏళ్ల పాటు పార్టీ కోసం శ్రమించిన ఆయన.. హఠాత్తుగా రాజీనామా చేయడంతో పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక రాజకీయాల్లో బీజేపీ విధానాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున పలు టీవీ ఛానెల్స్ లో చర్చలకు హాజరయ్యేవారు.
కాగా, వృత్తిపరంగా బ్రిజేశ్ కలప్ప సుప్రీంకోర్టు లాయర్‌గా పని చేశారు. అలాగే కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ న్యాయ సలహాదారుడిగా పని చేశారు. ఇటీవల పార్టీలో అంతర్గత విబేధాలు జరిగినట్లు సమాచారం. పార్టీపై తనకు ఆసక్తి తగ్గిపోయిందని, పార్టీలో కొనసాగే భావన తగ్గిపోయిందని బ్రిజేశ్ తెలిపారు. ఈ మేరకు మే 30వ తేదీన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. కలప్ప రాజీనామాపై ఆ పార్టీ నేతలు స్పందించారు. పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా తన పేరు లేకపోవడంతో కలప్ప రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.