దారుణం: బాలికను 14 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కోపంతో ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. ప్రాణాపాయ స్థితిలో ఆ బాలిక చికిత్స పొందుతోంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

బాలిక-కత్తిపోట్లు
బాలిక-కత్తిపోట్లు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చిలో ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. పరీక్షలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో కేశవన్ అనే యువకుడు బాలికపై కత్తితో దాడి చేశారన్నారు. బాలికపై 14 కత్తిపోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, గతంలోనూ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడని, జూన్ నెలలో కిడ్నాప్‌కు కూడా ప్రయత్నించినట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడు కేశవన్‌ను అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటికి వచ్చాడన్నారు.

దీంతో బాలికపై కోపం పెంచుకున్న కేశవన్.. మళ్లీ ప్రేమించమని వేధించడం మొదలు పెట్టాడన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేశవన్.. బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేశవన్ పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.