భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి వద్దే ఎలిజబెత్‌ 2 ఖననం

-

రాణి ఎలిజబెత్‌-2ను ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి చెంతనే ఖననం చేయనున్నారు. బకింగ్‌హం ప్యాలెస్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబే వద్ద సాగే రాణి అంత్యక్రియలు ఈనెల 19న ఉదయం 11 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. చివరగా దేశవ్యాప్తంగా రెండు నిమిషాల మౌనం పాటించే కార్యక్రమంతో ముగుస్తుంది.

సోమవారం ఉదయం 8 గంటల నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేలోకి 2000 మంది అతిథులను ఆసీనులయ్యేందుకు వీలుగా అనుమతిస్తారు. వీరిలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సహా 500 మంది ప్రపంచ నేతలుంటారు. ఇందుకోసం వారంతా బ్రిటన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రవాణా ఏర్పాట్లను వినియోగించుకుంటారు.

సెయింట్‌ జార్జిస్‌ చాపెల్‌ వద్ద నిర్వహించే అంత్యక్రియల కోసం అబే నుంచి రాణి శవపేటికను విండ్సర్‌ కాజిల్‌కు చేరుస్తారు. కింగ్‌ జార్జి-6 మెమోరియల్‌ చాపెల్‌ వద్ద కింగ్‌ ఛార్లెస్‌-3తో పాటు బ్రిటన్‌ రాజవంశానికి చెందిన ఇతర సీనియర్‌ సభ్యుల సమక్షంలో రాణి శవపేటికను గత ఏప్రిల్‌లో మరణించిన ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి చెంతకు చేరుస్తారు. ఎలిజబెత్‌-2 శవపేటికను సోమవారం ఉదయం 6.30 గంటల తరువాత రాయల్‌ నావికాదళం ఊరేగింపుగా అంత్యక్రియల ప్రదేశానికి తీసుకువస్తుంది. ఈ ప్రదర్శనలో కింగ్‌ ఛార్లెస్‌, ఆయన కుమారులు, యువరాజులు విలియం, హ్యారీలతో పాటు వెస్ట్‌మినిస్టర్‌ డీన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌, కామన్వెల్త్‌ ప్రధాన కార్యదర్శి బరోనెస్‌ పాట్రిసియా స్కాట్‌లాండ్‌ పాల్గొంటారు. చివర్లో శవపేటిక వెంట కింగ్‌, క్వీన్‌, రాజవంశీయులు మాత్రమే ఉంటారు.

సాయంత్రం నాలుగు గంటలకు శవపేటికను రాయల్‌ వాల్ట్‌లో దించుతారు. అక్కడ విండ్సర్‌ డీన్‌ కీర్తన ఆలపిస్తారు. కాంటెర్‌బరీ ఆర్చిబిషప్‌ దీవెనలు, జాతీయగీతాలాపనతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా పూర్తవుతుంది. అనంతరం 7.30 గంటలకు రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియ విండ్సర్‌ డీన్‌ ఆధ్వర్యంలో ముగుస్తుంది. ఎలిజబెత్‌-2 అంత్యక్రియల నేపథ్యంలో ఏర్పడే రద్దీ దృష్ట్యా హీత్రూ విమానాశ్రయంలో సోమవారం సుమారు 100 విమాన సేవలను రద్దయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news