ఖమ్మం చీమలపాడు అగ్ని ప్రమాద ఘటనలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి రేణుక చౌదరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చీమలపాడు ఘటన లో అమాయకులు బలి అయ్యారని అన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అధికార మదంతో వ్యవహరించారని మండిపడ్డారు రేణుక చౌదరి. లోకల్ మంత్రి ఒక పనికి మాలిన వెదవ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నాయకుల రాజకీయాలకు పేదవారు బలి అవుతున్నారని ఆరోపించారు. నిమ్స్ లో నలుగురు చికిత్స పొందుతున్నారని.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నలుగురికి చేతులకు, కాళ్ల కు గాయాలయ్యాయి, ఒకరికి ఇన్ఫెక్షన్ రావడంతో కాలు తీసేసారని వెల్లడించారు. మానసికంగా వాళ్ళు కుంగిపోయారని తెలిపారు రేణుక చౌదరి. నిన్న సందీప్ అనే వ్యక్తి చనిపోతే దొంగ చాటుగా తరలించి అంత్యక్రియలు చేశారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఘటనను తప్పుదోవ పట్టించి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు రేణుక చౌదరి.