మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఇవాళ బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ జరగనున్న బహిరంగసభ వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణానికి నలువైపులా కిలోమీటర్ల మేర గులాబీ రంగు సంతరించుకుంది. వరుస క్రమంలో ఏర్పా టు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్..
———————————————-
హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరి ఇవాళ మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి 1.30గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతల చేరికలు ఉంటాయి. అనంతరం బీఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రసంగం.
2.30గంటలకు సభా స్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు. భోజనానంతరం 4గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.