మునుగోడు ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్ పార్టీలో సరికొత్త ఉత్సాహం నింపింది. ఈ విజయం భారత్ రాష్ట్ర సమితికి శుభశకునమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. మునుగోడులో గెలుపు బీఆర్ఎస్కు పునాది అవుతుందని ఇంతకుముందే గులాబీ బాస్ ప్రకటించారు. ఈ విజయంతో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజల ముందుకెళ్లోందుకు రెడీ అవుతోంది. ఈసీని కలిసి పేరు మార్పునకు సత్వరమే ఆమోదం తెలపాలని కోరనుంది. ఒకవేళ ఈసీ జాప్యం చేస్తే న్యాయపరంగా పోరాడాలని భావిస్తోంది. పార్టీకి దేశ, రాష్ట్ర కార్యవర్గాలను నియమించనుంది. రాష్ట్ర విభాగానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షుడిగా ఉండనున్నారు. జాతీయ కార్యవర్గంలో సీనియర్ నేతలకు పదవులు ఇవ్వనున్నారు.
త్వరలో జరగనున్న హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి చాటేందుకు ఏం చేయాలనే అంశంపై పార్టీ దృష్టి సారించనుంది. గుజరాత్‌లోని సూరత్ తదితర చోట్ల పోటీ చేయాలని ఆయా రాష్ట్రాల్లోని తెలంగాణ నేతల నుంచి వినతులు వస్తున్నాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.