ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సుమారు రెండు గంటలసేపు నగరంలో పర్యటించనున్న ప్రధాని రూ.11 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని కార్యక్రమాల్లో రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. బహిరంగసభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కూడా షెడ్యూలులో చేర్చారు. కానీ ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ప్రకటించారు. ప్రధానికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వాగతం పలకనున్నారు. అయితే… ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. అంతేకాదు.. బర్రెలకు వినతి పత్రాలు ఇస్తూ నిరసన తెలిపారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు. వందే భారత్ ట్రైన్ ను ఢీ కొట్టకుండా.. కాపాడు అంటూ బర్రెలకు వినతులు ఇచ్చారు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు.