తెలంగాణ బడ్జెట్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ ని పనికిరాని పేపర్ లాగా మార్చారని, చెత్తబుట్టలో పడేసేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బడ్జెట్ కొత్త సీసాలో పాత సార పోసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొత్తగా ఏమీ లేదని, గత ఏడాది బడ్జెట్ ని కాపీ పేస్ట్ చేశారని ఆరోపించారు.
గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కేటాయింపులు, ఖర్చులకు పొంతనే లేదని విమర్శించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ కావాలంటే 19 వేల కోట్ల నిధులు కావాలన్నారు. కానీ బడ్జెట్ లో కేవలం 6 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, వాటితో ఎంతమందికి రుణం మాఫీ చేస్తారని ప్రశ్నించారు. ఒక కాలేశ్వరం ప్రాజెక్టు తప్పితే మిగతా ప్రాజెక్టులు ఏవి పూర్తి కాలేదన్నారు.