స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. స్కిల్ కేసులో 2017 నుంచి విచారణ జరుగుతోందని తెలిపారు. జీఎస్టీ వల్ల స్కిల్ స్కాం బయటపడిందని, దీనిపై జీఎస్టీ, ఈడీ, సెబీ కూడా విచారణ జరిపాయని వివరించారు. ఇంతటి తీవ్రత ఉన్న కేసులో సీఐడీ విచారణ చేయకూడదా? అని బుగ్గన ప్రశ్నించారు. స్కిల్ వ్యవహారంలో గ్రాంట్ ఇన్ కైండ్ అనే పద్దతే లేదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేస్తోందని అన్నారు. ఏ విధంగా చూసినా ఈ కుంభకోణంలో రూ.250 కోట్లకు లెక్కలు దొరకడంలేదని బుగ్గన వ్యాఖ్యానించారు. టీడీపీ నేత పయ్యావుల కాస్త ఓపిక పట్టాలని హితవు పలికారు. ఈ వ్యవహారం కోర్టు తేల్చిన తర్వాత పయ్యావుల మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
టీడీపీ నేతల ఆరోపణల్లో అర్ధమే లేదన్నారు. ఈ మేరకు యనమల రామకృష్ణుడు ఆరోపణలను ఖండించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దన్న ఆయన.. గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని దుయ్యబట్టారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలే 4 లక్షల కోట్ల అప్పు అంటున్నారని.. 10 లక్షల కోట్లు అంటున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్ధముందా అని బుగ్గన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా అర్ధం లేని ఆరోపణలు చేయడం సరికాదని.. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలపై టీడీపీ ఎందుకు మాట్లాడటం లేదని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పులపై ఎలాంటి దాపరికం లేదని బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నామన్నది అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.