తెలంగాణ ప్రజల ఆంక్షాలకు అనుగుణంగా.. కేసీఆర్ కుటుంబ పాలన, రాక్షస పాలన అంతం చేసేందుకు పని చేస్తామన్నారు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. నవంబర్ 2వ తేదీ ఢిల్లీలో.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గేతో.. ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వివేక్ వెంకటస్వామితోపాటు ఆయన సతీమణి సరోజ, కుమారుడు వంశీ కృష్ణ కూడా ఖర్గేతో భేటీ అయిన వారిలో ఉన్నారు. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉందని.. రాహుల్ గాందీ లీడర్ షిఫ్ లో పని చేయటం సంతోషంగా ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ తనకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచారని మాజీ ఎంపీ జి.వివేక్ అన్నారు.
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వివేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. వామపక్షాలకు చెన్నూరు కేటాయిస్తామని తొలుత కాంగ్రెస్ తెలిపింది. ఇప్పుడు పొత్తుకు బ్రేక్ పడిన నేపథ్యంలో వివేక్‌కు చెన్నూరు టిక్కెట్ ఖరారైనట్లుగా భావించవచ్చునని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ రాక్షస పాలన నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు ఆయన.