నివాళి అన్నది ప్రత్యేక రీతి. అది నింద నుంచి స్తుతి వరకూ అంతా జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మహా నటుడు, రాజకీయ వేత్త అయిన ఎన్టీఆర్ కు నివాళి అంటే మరో ప్రత్యేక రీతి. ఆయన తెలుగు జాతిని ప్రభావితం చేసిన తీరులో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది. మరి! ఆ పార్టీ మహానాడు ఎలా ఉంది. భవిష్యత్ కాలంలో అభ్యర్థులు ఎవరు? పార్టీ తరఫున అరెస్టు అయిపోండి అని చెబుతూ, కార్యకర్తలను ఎందుకని రెచ్చగొడుతున్నారు? ఇవన్నీ ఆలోచించాకే మాట్లాడాలి. అంటే ఎవరో ఒకరు చేరుకునేందుకు అవకాశం ఉన్న అధికారం అనే ఓ సోపానం కోసం ఎవరో ఒకరు త్యాగం చేస్తూనే ఉండాలన్న మాట. అన్నమాట అదే ఉన్న మాట కూడా ఇవాళ !
అనూహ్య రీతిలో జనం వచ్చారు. మహానాడు కార్యక్రమానికి తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్ చేసిన కృషి, ఇతర అనుబంధ విభాగాలు చేసిన కృషి ఫలితం ఇచ్చింది. ఆ విధంగా నిజంగానే నేల ఈనిందా అన్న విధంగా జనం వచ్చారు. బాబు కూడా ఉత్సాహంగానే మాట్లాడేరు. కానీ రేపటి వేళ ఏం చేస్తామో అన్నది చెప్పలేదు. పార్టీపరంగా వచ్చే మార్పులు కూడా పెద్దగా వివరించలేదు. వచ్చే ఎన్నికలకు ఏ విధంగా సమాయాత్తం కావాలన్నదీ చెప్పలేదు. ఏ విధంగా చూసుకున్నా సభ సక్సెస్ కానీ
సాధించాల్సినవి ఏంటన్నది స్పష్టం కాకుండా పోయింది. దీంతో కొంత విమర్శలతో కూడిన వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి.
ఇంకా ఏమయిందంటే…?
మూడక్షరాల పేరు ఎన్టీఆర్.. తెలుగు వారి ఖ్యాతి ఎన్టీఆర్.. ఆత్మ గౌరవ పతాక మరియు ప్రతీక ఎన్టీఆర్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ కొనియాడారు. నాయకులూ కీర్తించారు. అంతా బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ కోసం ఏం చేశారన్నది చెప్పారా? ఎన్టీఆర్ స్మారకార్థం ఏం చేయాలి అని అనుకుంటున్నామో అన్నది అయినా చెప్పారా? ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తుంది. హిందూపురంలో నిన్నటి వేళ అన్న భోజన శాల పేరుతో ఏడాది పాటు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని బాలయ్య భార్య వసుంధర ప్రారంభించారు. ఇది పూర్తిగా అమెరికాలో ఉన్న ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల సహకారంతో నడవనుంది. ఇదొక్కటీ తప్ప నిన్నటి వేళ నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ కోసం తామేం చేయనున్నామో అన్నది పెద్దగా చెప్పిన దాఖలాలేవీ లేవు. బాలయ్య నుంచి కానీ తారక్ నుంచి కానీ పెద్ద పెద్ద ప్రకటనలేవీ రాలేదు. అంటే దాతృత్వానికి సంబంధించి ఏమీ రాలేదు.
ఇక చంద్రబాబు కూడా మహానాడు వేదికగా మ్యానిఫెస్టోను ప్రకటించలేదు. ఆయన కనుక ప్రకటించి ఉంటే బాగుండేది అన్న మాట ఒకటి వినిపించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నను తప్పిస్తామన్న మాట ఒకటి మహానాడు సందర్భంగా నిర్వహించిన పొలిట్ బ్యూరో లో వినిపించినా, అది కూడా జరగలేదు. అంటే కొత్త రాష్ట్ర అధ్యక్షుడి రాక ఇప్పట్లో లేనట్లే ! ఏదేమయినప్పటికీ అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రెస్మీట్లో తిట్టిన విధంగా, ఎఫ్బీ లైవ్ లలో తిట్టిన విధంగా అయ్యన్న మాట్లాడారే తప్ప ఆత్మ పరిశీలన లేదు. ఆత్మ పరిశీలన లేని కారణంగానే చాలా నిజాలు వెలుగులోకి రాలేదు. రాజధాని అమరావతి ఊసే లేకుండా ప్రసంగాలు కొందరివి సాగేయి. ముగిసేయి.