కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు ఉంచాలా.. లేదా పేరును మార్చాలా అనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని మంత్రి ఆర్‌కే రోజా కోరారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు.. ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలియజేయకుండా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
మహిళలతో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టిస్తూ చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడని ఆమె మండిపడ్డారు. కుప్పం, వైఎస్‌ఆర్, కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఎవరూ లాభపడలేదని, కానీ వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు కూడా లాభపడ్డరని తెలిపారు. దాదాపు 30 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లేరని నారా లోకేశ్ చెప్పడం విచారకరమన్నారు. ఏదైనా ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టమని చెప్పిన టీడీపీ, జనసేన.. ఇప్పుడు రాజకీయం చేసి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.