ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నా ఉన్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. ఇటీవల మూడు రాజదానులకు సంబంధించి కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి జగన్, విశాఖలో సచివాలయం సహా పరిపాలన అక్కడి నుంచే అన్నట్టు చెప్పారు. ఆ తర్వాత వచ్చిన కమిటి నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేలా కనపడటం లేదు. అమరావతిలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నా సరే జగన్ మాత్రం చెప్పిన మాటపై వెనక్కు తగ్గే సూచనలు కనపడటం లేదు. ఈ నేపధ్యంలోనే విశాఖలోనే కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 27 న కేబినేట్ సమావేశం జరగనుంది. ఇందులో కమిటి నివేదికపై చర్చ జరుగుతుంది.
ఈ సమావేశాన్ని విశాఖలోనే నిర్వహించాలని ఆయన సియేస్ నీలం సహానిని ఆదేశించారు. దీనితో ఆమె విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కి ఏర్పాట్లు చెయ్యాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అమరావతి ప్రాంతంలో నిరసనలు కారణంగానే అక్కడ నిర్వహిస్తున్నారని చెప్పినా, రాజధాని విషయంలో విశాఖలో తొలి అడుగు పడింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి.