గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుండి విపరీతమైన ఎండ, ఉక్కబోత తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. తాజాగా ఈ ఎండ ప్రతాపానికి ఓ కారు పూర్తిగా కాలి బూడిద అయ్యింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల పట్టణ శివారులో ఎండ వేడికి కారు కాలిపోయింది.
జగిత్యాల మండలం చాల్ గల్ గ్రామానికి చెందిన సుర బక్కయ్య అనే వ్యక్తి తన కారులో కోరుట్లకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎండ వేడికి ఒక్కసారిగా ఇంజన్ లో నుండి మంటలు వచ్చాయి. వెంటనే బక్కయ్య అప్రమత్తం అయ్యి, రోడ్డు పక్కనే తన కారును ఆపి దిగడంతో తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ తర్వాత అగ్నిమాప సిబ్బందికి సమాచారం తెలియచేశాడు బక్కయ్య. అయితే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా కాళీ బూడిదయ్యింది.