మంత్రి ఈటల రాజేందర్‌పై ఆయన కారు మాజీ డ్రైవర్ మేకల మల్లేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఈటల పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని మల్లేశ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈటల డ్రైవర్‌గా పనిచేస్తూ ఆయనతో కలసి ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. నాడు అసెంబ్లీలో జరిగిన ఘటనలో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు గుర్తుచేశారు.
దీంతో జైలు నుంచి విడుదలయ్యాక వివిధ సంఘాల నేతలు తనను సన్మానించి, ఆర్థిక సాయం కింద రూ.30లక్షలు ఇస్తే, వాటిని ఈటల తీసుకున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే జైలుకు వెళ్లడంతో ఉద్యోగం పోయిందని, తర్వాత కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. తాను నమ్ముకున్న ఈటలతో పాటు, అందరూ అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లేశ్ కామెంట్స్ పై తెరాస నేతలతో పాటు ఇతర పార్టీల నాయకుల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.