వైసీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఎస్ఏఎంబీ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది సీబీఐ. వ్యాపారం చేయడం కోసమని రుణం తీసుకుని రూ.237.84 కోట్ల రూపాయలు దారి మళ్లించారనే ఫిర్యాదుపై రఘురామకృష్ణరాజుకి చెందిన ఇండ్ భారత్ పవర్ జెన్కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
నిందితులంతా కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు అసలైనవిగా చూపించడం సహా పలు నేరాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఈ మోసం జరిగినట్లు ఆడిట్‌లో గుర్తించామని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారని ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది. ఇండ్ భారత్ పవర్ జెన్కమ్ లిమిటెడ్ డైరెక్టర్ రఘురామకృష్ణరాజు, ఇతర డైరెక్టర్లు సహా వివరాలు తెలియని మరికొంత మంది ప్రభుత్వోద్యోగుల మీద సీబీఐ కేసు నమోదు చేసింది.