రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ వ్రాశారు. ఏపీలో ప్రాధమిక హక్కులు కాలరాస్తున్నారని రాజ్యాంగంలోని 19, 21 ఆర్టికల్స్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందన్న ఆయన ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని లేఖలో ప్రధాని మోడీకి బాబు ఫిర్యాదు చేశారు. ఇటువంటి దుశ్చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గిస్తాయని పేర్కొన్నారు. ఏపిలో వైసీపీ, ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ద కార్యకలాపాలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపిలో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించమని కోరారు. ఇక ఇదే లేఖ ప్రతిని కేంద్ర ఐటి శాఖా మంత్రికి కూడా పంపారు చంద్రబాబు.