కరోనా నిర్దారణ పరీక్షలకు గాను ప్రస్తుతం ప్రభుత్వాలు రెండు రకాల పరీక్షలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టు. రెండోది ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు. ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టు ద్వారా ఫలితం వేగంగా తెలుస్తుంది. కానీ కచ్చితత్వం ఉండదు. అందువల్లే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. అయితే ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల ద్వారా ఫలితం వచ్చేందుకు చాలా సమయం పడుతోంది. దీంతోపాటు టెస్టులను ఎక్కువగా చేయలేకపోతున్నారు. కానీ హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ (సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ) అభివృద్ధి చేసిన నూతర ఆర్‌టీ-పీసీఆర్ కిట్ సహాయంతో ఇకపై కోవిడ్ టెస్టులను వేగంగా చేయవచ్చు.
కోవిడ్ టెస్టుల నేపథ్యంలో సీసీఎంబీ అభివృద్ధి చేసిన నూతన ఆర్టీ-పీసీఆర్ టెస్టు కిట్ ద్వారా డ్రై విధానంలో ముక్కు ద్వారా శాంపిల్స్‌ను సేకరిస్తారు. దీంతో ఆ శాంపిల్స్‌ను సేకరించడం, రవాణా చేయడం, టెస్టు చేయడం వేగంగా జరుగుతుంది. దీని వల్ల టెస్టులు చేసేందుకు అవసరం అయ్యే మ్యాన్ పవర్ కూడా 40-50 శాతం వరకు తగ్గుతుంది. అంటే ఈ కిట్‌లతో టెస్టులు చేసేందుకు పెద్దగా సిబ్బంది అవసరం ఉండరన్నమాట. అలాగే టెస్టులను వేగంగా చేయవచ్చు. దీంతో ఫలితాలు కూడా వేగంగా వస్తాయి.
ఇక ఈ టెస్టు కిట్‌లకు గాను ఇప్పటికే పలు హెల్త్ కేర్ కంపెనీలకు లైసెన్స్‌లు ఇచ్చారు. అపోలో హాస్పిటల్స్, మెరిల్ లైఫ్, స్పైస్ హెల్త్, క్యాపిటల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ఈ టెస్టు కిట్‌లను తయారు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో త్వరలోనే నూతన ఆర్టీ-పీసీఆర్ టెస్టు కిట్‌లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో 500 కేంద్రాల్లో ఈ నూతన టెస్టు కిట్‌లను తొలి దశలో ఉపయోగించనున్నారు. తరువాత ఇతర ప్రాంతాల్లోనూ వీటిని వాడనున్నారు.