కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత మందికి వర్తింపజేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు కేవలం పేదవారికి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందిస్తున్నారు. ఈ పథకాన్ని 2018లో ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు మొత్తం 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలిగింది. 53 కోట్ల మంది ఈ పథకంలో భాగంగా ఉన్నారు. అయితే దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న మధ్యతరగతి వర్గాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయుష్మాన్ భారత్ స్కీం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే మధ్య తరగతి వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తే సుమారుగా 45 కోట్ల మంది కొత్తగా ఈ పథకం కిందకు వస్తారు. కానీ వారికి భిన్న రూపంలో ఈ పథకాన్ని అందించాలని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా ఒక వ్యక్తి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే దానికి ఏడాదికి ప్రీమియం రూ.10వేల నుంచి రూ.15వేల వరకు అవుతుంది. అయితే మధ్యతరగతి వారు అంత ప్రీమియం చెల్లించి హెల్త్ ఇన్సూరెన్స్ పొందలేరు. కనుక వారికి ప్రీమియంలో సబ్సిడీని అందివ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీంతో ప్రీమియం సగానికి తగ్గుతుంది. కేవలం రూ.4వేల నుంచి రూ.5వేలు చెల్లిస్తే రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఇక ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు నమోదు చేసుకున్న పేదలకు ఇస్తున్నట్లుగానే మధ్యతరగతి వారికి కూడా ఈ పథకం కింద లబ్ధి కలుగుతుంది. కాకపోతే వారు ప్రీమియం మొత్తంలో దాదాపుగా సగం వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ దానికి అందే ప్రయోజనాలు ఒక్కలాగే ఉంటాయి. దేశంలో ఇప్పటికీ అనేక మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అందువల్లే కేంద్రం త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది.