ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగన్ సర్కార్ పురోగతి సాధించింది. ఏబీకి కేంద్ర హోంశాఖ భారీ షాక్ ఇచ్చింది తాజాగా. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునికీకరణ పేరుతో రాష్ట్ర ఖజానాకు రూ.25కోట్ల మేర నష్టం కలిగించారని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్రం స్పందించింది.
నివేదిక మీద సమగ్రమైన చార్జ్ షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆయన సస్పెన్షన్ ని కేంద్రం సమర్ధించింది అంటున్నారు. ఏబీ అవినీతిపై ఏసీబీ డీజీతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని జగన్ సర్కారు కేంద్రానికి చెప్పగా ఆ నివేదికను తమకు తెలియజేయాలని కేంద్ర హోశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఆయన తన సస్పెన్షన్ వ్యవహారాన్ని క్యాట్ లో సవాల్ చేసారు.
తనను అన్యాయం గా సస్పెండ్ చేసారు అంటూ ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని గతేడాది మే 31 నుంచి తనకు జీతం చెల్లించకుండా వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఫిర్యాదు చేసారు. తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై స్టే విధించాలని ఆయన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఇప్పుడు ఈ తీర్పుని క్యాట్ రిజర్వ్ చేసింది.