కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చిన్న చిన్న లీడర్ల నుంచి ఉప రాష్ట్రపతి వరకు అందరూ కరోనా బారినపడుతున్నారు. లాక్ డౌన్ దాకా కాస్త కంట్రోల్ లోనే ఉన్నా అన్ లాక్ దశ మొదలైనప్పటినీ నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. పలువురు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక తాజాగా మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు.
పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని జోషి ట్వీట్ చేశారు. ఆయన నిన్న కాక మొన్ననే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.