రాజకీయాలు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ, ఈ విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండలేక పోతున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనడంలో సందేహం లేదు. గతం నేర్పిన పాఠాల నుంచి కూడా వారు ఏమీ నేర్చుకోలేక పోవడం మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీలో చర్చ సాగుతోంది. గతంలో టీడీపీలో మంత్రిగా ఉన్న గుంటూరు నాయకుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రావెల కిశోర్‌బాబు.. మంత్రి పదవిని దక్కించుకున్నారు.
అప్పటి వరకు ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి రావడం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలవడం వెంటనే మంత్రి అవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన తన ఫ్యామిలీని కంట్రోల్ చేసుకోలేక పోయారు. తన ఇద్దరు కుమారులు కూడా తండ్రి పదవిని చూసుకుని పొరుగు రాష్ట్రం సహా ఏపీలోనూ రెచ్చిపోయారు. తెలంగాణలో రావెల కుమారుడు కారులో వెళ్తూ వెళ్తూ.. ఓ మహిళ చేయిని పట్టుకుని వేధించారనే కేసు ఉంది. అదేసమయంలో గుంటూరులో ఓ మహిళా హాస్టల్లోకి అర్ధరాత్రి ప్రవేశించారనే కేసు కూడా మరో కుమారుడిపై ఉంది. దీంతోమంత్రి తీవ్రంగా ఇరకాటంలో పడ్డారు. చివరాఖరుకు మంత్రి పదవినే పోగొట్టుకున్నారు.
దీంతో మంత్రులు.. నాయకులు తమ కుటుంబాల విషయంలో జాగ్రత్తగా ఉండాలనే పాఠం వచ్చింది. అయితే, ఈ విషయాన్ని గుర్తించారో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం వైసీపీ మంత్రిగా ఉన్న కర్నూలు జిల్లా ఆలూరు నాయకుడు గుమ్మనూరు జయరాం కూడా ఇరకాటంలో పడ్డారు. ఆయన కుమారుడు చేసిన పనితో ఆయన పదవికే ఎసరు వచ్చి పడిందని అంటున్నారు వైసీపీ నాయకులు. ఆయన కుమారుడు.. ఓ వ్యక్తి నుంచి కారును బహుమానంగా తీసుకున్నారని.. ఇలా ఇచ్చిన వ్యక్తి ఈఎస్ ఐ కుంభకోణంలో ఉన్నారని ప్రతిపక్షాలు రోజుకో బాంబు పేలుస్తున్నారు.
తాజాగా కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరిన్ని సాక్ష్యాలు చూపించారు. దీంతో జయరామ్‌ను తొలగించాలనే డిమాండ్ మరింత పెరిగింది. మొత్తానికి కుమారులను వెనుకేసుకు వస్తున్నా.. జయరామ్ మాత్రం పూర్తిగా సమర్ధించుకోలేక పోతున్నారు. ఫలితంగా రావెల మాదిరిగా ఆయన పదవి పోగొట్టుకోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
-Vuyyuru Subhash